బీఆర్ఎస్ ది తప్పుడు ప్రచారం

0 1,701

. చట్టానికి లోబడే హైడ్రా పని చేస్తోంది

. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ:  అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయని బీఆర్ ఎస్ ప్రజల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ను విమర్శించడం విడ్డూరంగా ఉందని, ఆ పార్టీ నాయకుడు తప్పుడు ప్రచారంచేస్తున్నారని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ, హైడ్రా అంశాల్లో బీ ఆర్ ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేస్తోందని, బ్యాంకుల్లో వివరాలు తప్పుగా ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తించలేదని.. ఆ సమస్యను సైతం త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. హైడ్రా చట్టానికి లోబడి పని చేస్తోందని, మూసీ పరీవాహక ప్రాంతంలోని ఏ ఒక్క పేద  ఇంటిపై హైడ్రా ఇప్పటివరకు వెళ్లలేదని, కేవలం ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారి నుంచి స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడే ముందు వారు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకొని మాట్లాడాలన్నారు. ఈనెల 4వ తేదీన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జిల్లాకు రానున్నారని, పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, బాల్కొండ నియోజకవర్గ ఇన్ చార్జి సునీల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, వేణు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.