25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పై మంగళవారం శాసన సభలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్పీ వర్గీకరణ బిల్లును సమర్తిస్తున్నామని అన్నారు. మాదిగల సామాజిక ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా కేసీఆర్ వర్గీకరణ అంశానికి మొదటి నుండి సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి పుట్టిన పార్టీ కాబట్టి స్వయంగా కేసీఆర్ ఒక అస్తిత్వ ఉద్యమ నాయకుడిగా వర్గీకరణ అంశంలో మందకృష్ణ మాదిగ తో పాటు అనేక ఇతర సంఘాలు,సంస్థలు, వ్యక్తులు,మేధావులు చేసిన పోరాటాన్ని,ఉద్యమాన్ని అర్థం చేసుకొని వారి కార్యాచరణకు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. మాదిగలను కేవలం ఓటు బ్యాంకు గా చూసే కొన్ని రాజకీయ పార్టీల అవకాశవాదానికి భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ , కేసీఆర్ అధికారం లో ఉన్నా లేకున్నా ఉద్యమం నుండి ఈ రోజు దాకా సుమారు 25 సం౹౹లుగా ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో ఒకే స్టాండ్ తీసుకొని మద్దతు అందించారు,అందిస్తూనే ఉన్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే 29 నవంబర్ 2014 లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేసీఆర్ కేంద్రానికి పంపించారని తెలిపారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ని స్వయంగా కలిసి తీర్మాణం కాపీలను అందజేసి రాజ్యాంగ సవరణ చేయాలని కోరారని తెలిపారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వ నాన్చివేత ధోరణి ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశంలో వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీ లు అనేక సార్లు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు కు ఎస్పీ వర్గీకరణ అంశం చేరితే సుప్రీం కోర్టులో ఉన్న వర్గీకరణ కేసులో అప్పటి  రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ అయి అనుకూల వాదనలు వినిపించామన్నారు. చివరకు ఆగస్టు 1 ,2024 న సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకుంది అని తీర్పు ఇస్తే ఆ తీర్పును బీఆర్ఎస్ పార్టీ వెంటనే స్వాగతించింది, సమర్థించిందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం చేసే అన్ని సానుకూల నిర్ణయాలకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. 10 సంవత్సారాల పాటు బీజేపీ నాన్చివేత ధోరణి తో లక్షలాది మంది మాదిగ బిడ్డలకు దక్కాల్సిన విద్య,ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్ ప్రకారం అవకాశాలు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ఇప్పుడేమో పాత రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి నుండి రాబోయే అన్ని విద్యా,ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది అన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి అయితే స్థానిక సంస్థల్లో మాదిగలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు.

More articles

Latest article