. . . టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందజేసి ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో 90 కు పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లు, 1300కు పైగా వార్డులు, 154కు పైగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలు తమ మద్దతును స్పష్టంగా వెల్లడించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారదర్శక పాలన అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్‌కు ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. సామాన్యుల సంక్షేమం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ లక్ష్య సాధనకు ప్రజలు మరోసారి ఆశీర్వాదం అందించారని తెలిపారు. వరుస విజయాలతో పార్టీపై రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రజలు వాటిని నమ్మకుండా అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేశారని అన్నారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్ వంటి అంశాల్లో స్పష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ టీపీసీసీ అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత పారదర్శకంగా, ప్రజాకేంద్రిత పాలన అందిస్తూ తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలపడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
