. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ కళాశాల అధ్యాపకులకు రెండవ స్పెల్ రెండు రోజుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధన అందించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా అధ్యాపకులు బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవాలని అన్నారు.

మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్ ఈ రెండు రోజుల శిక్షణలో అధ్యాపకులకు బోధనా మెళకువలు, ఆధునిక బోధనా పద్ధతులపై శిక్షణ అందిస్తారని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అధ్యాపకులు ఈ శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలని ఆకాంక్షించారు. శిక్షణ తరగతుల్లో ఫిజికల్ సైన్స్, కామర్స్, బయాలజీ, హిస్టరీ తదితర సబ్జెక్టులకు చెందిన అధ్యాపకులు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

