. . . విద్యార్థిని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
. . . రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి, కార్యదర్శి నారాగౌడ్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
9631
గత రెండురోజుల క్రితం నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ తండాకు చెందిన 8వ తరగతి విద్యార్థిని శ్రావణి (13) బీసీ బాలికల వసతి గృహంలో అనుమానాస్పద మృతి చెందడంతో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం సందర్శించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి, రాష్ట్ర కార్యదర్శి నారాగౌడ్ ఆధ్వర్యంలో స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక మృతి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఒక చిన్నారి ప్రాణం పోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, బీసీ పిల్లల ప్రాణాలకు విలువ లేదా అంటూ మండిపడ్డారు. ఘటన వెనుక అసలు నిజాలను తక్షణమే బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ వసతి గృహాల నిర్వహణ పూర్తిగా అవ్యవస్థకు గురైందని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. ఒక్కో హాస్టల్‌కు ఒకే వార్డెన్ ఉండాల్సి ఉండగా, ఒకే వార్డెన్‌ను రెండు మూడు హాస్టళ్లకు ఇంచార్జిగా నియమించడం వల్లే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇన్‌చార్జ్ వార్డెన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి నిజాలు ప్రజల ముందుంచాలని, నిర్లక్ష్యానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మంగలి ఎల్లయ్య, ఉపాధ్యక్షులు నాగం దేవేందర్, ముక్తల్ మండల అధ్యక్షులు మయూర్, లింగంపేట్ మండల అధ్యక్షులు లక్ష్మణ్, ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు దేవల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
