- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
రాజంపేట్, బతుకమ్మ : భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా బుధవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి, రాజంపేట, తాడ్వాయి రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సెక్షన్ 4 ప్రకారం హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలో గా దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకోవచ్చని తెలిపారు. సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసిన క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. అట్టి వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలో రైతులకు భూదార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే నివృత్త చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు. చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. హక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్సు గల సర్వేయర్ తో భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాసుపుస్తమలో సర్వే మ్యాప్ ను ఉంచడం జరుగుతుందన్నారు. ఏ మైన భూ సమస్య ఉంటే సదరు పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ఎవిడెన్స్ రికార్డు చేయాలనీ స్పీకింగ్ ఆర్డర్స్ స్పష్టమైన రీమార్కులతో నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు పెడితే భూ భారతి చట్ట ప్రకారం విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలపై విచారణ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూ భారతి చట్టం లింగంపేట్ మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుచున్నదని తెలిపారు. ప్రజలందరూ భూ భారతి పై అవగాహన కల్పించుకోవాలని అన్నారు. ఆర్డీఓ వీణ మాట్లాడుతూ, భూ భారతి చట్టం గురించి వివరించారు. గత ధరణీ లో 33 మాడ్యూల్స్ ఉండేదని, ఈ భూ భారతి చట్టంలో కేవలం 6 మాడ్యూల్స్ తో భూముల యాజమానుల సమస్యలు తీర్చడానికి వీలు కలుగుతుందని తెలిపారు. భూముల విస్తీర్ణం, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. వార సత్వంగా వస్తున్న యజమానులకు పేరు మార్పులు చేయవచ్చని, దానికి ముందు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసి ఆర్డీఓ పూర్తి విచారణ జరిపి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారనీ తెలిపారు. గతంలో ధరణీ లో అప్పీలు ప్రోవిజన్ లేదని, కేవలం సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని తెలిపారు. భూభారతి చట్టంలో తహసీల్దార్ నిర్ణయించిన వాటిపై అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉందని, ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలకు అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, ఒక వేళ కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్ కు వెళ్లవచ్చని తెలిపారు. ఈ సదస్సులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పాక్స్ చైర్మన్లు, ఆయా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

