- పంపిణీ చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్
- పాలకవర్గం అనుమతితో జరిగిందా అనే అనుమానాలు
- మండిపడుతున్న రైతులు
నిజామాబాద్, బతుకమ్మ :
సహకార బ్యాంక్ ల నుంచి రుణాలు తీసుకుని చెల్లించని రైతుల భూములు వేలం వేస్తామని ఫ్లెక్సీలను వ్యవసాయ భూముల్లో ప్రదర్శించారు. రుణాలు చెల్లించని రైతుల ఇంటి దర్వాజలు, కిటికిలు ఊడబికాయి కొన్ని బ్యాంకులు. రైతులు రుణాలు తీసుకుని చెల్లించలేదని ఆస్తులు జప్తు చేశాయి మరికొన్న బ్యాంక్ లు. ఇవన్ని కూడా తమవి రైతు ప్రభుత్వమని గొప్పగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతుల పట్ల సహకార బ్యాంకులు వ్యవహరించిన తీరు సజీవ సాక్ష్యాలు. ఎందుకంటే బ్యాంకుల నుంచి చిన్న,సన్నకారు రైతులు తీసుకున్న అప్పుల విషయంలో కఠినంగా వ్యవహరించిన బ్యాంకులు మోతబరి రైతులు, భూస్వాములు, లీడర్లు తీసుకున్న రుణాల విషయంలో మెతకవైఖరి అవలంభించిన విషయం తెల్సిందే. ఆనాడు రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూల్ చేసిన బ్యాంక్ మేనేజర్లకు, సిబ్బందికి ఫలితం దక్కింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో బుధవారం జరిగిన బ్యాంక్ మేనేజర్ల సమావేశంలో క్యాష్ రివార్డులు, మెమోంటోలు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చిన్న రైతులను వేదించిన బ్యాంక్ అధికారులకు వేతనాలు చెల్లిస్తుండగా అదనంగా రివార్డులు, అవార్డులు పాలకవర్గం అనుమతితో ఇచ్చారా? లేక స్వయంగా పంపిణీ చేశారా? అనే విషయంపై చర్చ జరుగుతుంది.
నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో 63 బ్యాంక్ లు ఉన్నాయి. దాదాపు 200 కోట్ల రుణాలను రైతులకు ఇచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాన్ ఫర్ ఫామింగ్ అసెట్ (ఎన్ పీఏ) రుణాల విషయంలో బ్యాంక్ తీవ్ర సంక్షోభంలో మునిగింది. దాదాపు 100 కోట్ల బ్యాంక్ రుణాలు వసూల్ కాలేదు. దాదాపు 21 కోట్ల వరకు రికవరి జరిగిన దానిని లాస్ లో చూయించాల్సిన పరిస్థితి ఉండేది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 20 కోట్ల ప్రాఫిట్ చూయించడంతో బ్యాంక్ అప్పుల నుంచి తేరుకున్నట్లయింది. ప్రధానంగా బ్యాంక్ ఉద్యోగులకు పీఆర్సీ చేయలేమని చేతులెత్తేశారు. ఒక దశలో బ్యాంక్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారులకు వన్ టైం సెటిల్ మెంట్ అధికారం కట్టబెడుతూ కచ్చితంగా డబ్బుల రికవరికి ఒత్తిడి పెంచారు. దానితో తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంక్ ఉద్యోగులు చిన్న,సన్నకారు రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించాల్సిన పరిస్థితి దాపురించింది. కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 100 కోట్ల ప్రాఫిట్ లో ఉండగా నిజామాబాద్ బ్యాంక్ మాత్రం 100 కోట్ల లాస్ లో ఉంటే ఏ విధంగా వేతనాలు పెంచుతామని ఒత్తిడి చేయడంతో పాలకవర్గం ఒత్తిడికి తలొగ్గిన బ్యాంక్ ఉద్యోగులు రైతులను ముక్కుపిండి వసూల్ చేయడంతో బ్యాంక్ లాస్ లో కాకుండా లాభాల బాట పట్టినట్లయింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులను ముక్కుపిండి డబ్బులు వసూల్ చేసిన బ్యాంక్ అధికారులకు అవార్డులు, రివార్డులు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 63 బ్రాంచ్ లు ఉండగా బుధవారం జరిగిన బ్యాంక్ మేనేజర్ల సమావేశంలో రికవరిలో ముందు నిలిచిన బ్యాంక్ లకు మూడు ప్రైజ్ లు , లోన్ లు ఇవ్వడంలో ముందున్న వారికి మూడు ప్రైజ్ ల చొప్పున అవార్డులు అందజేశారు. అయితే ఈ వ్యవహరం పాలకమండలికి తెలిసి జరిగిందా? కేవలం చైర్మన్, బ్యాంక్ అధికారులే నిర్ణయం తీసుకున్నారనే చర్చ మొదలయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో సభ్యులు ఏకంగా చైర్మన్ వ్యవహర శైలిపై ప్రశ్నల పరంపర మొదలయింది. పాలకవర్గం అనుమతి లేకుండానే చేస్తున్న పనులపై సభ్యులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని గొప్పలు చెబుతుండగా పెద్ద పెద్ద మొత్తాలుగా రుణాలు తీసుకున్న వారిని వదిలి చిన్న,సన్నకారు రైతుల వద్ద రుణాలను వసూల్ చేసిన బ్యాంక్ ఉద్యోగులకు అవార్డులు, రివార్డులు ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో బ్యాంక్ లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇన్సూరెన్స్ వ్యవహరాన్ని పాలకవర్గం అనుమతి లేకుండానే జరిగిందని సభ్యులు ఇప్పుడు ఇది కూడా ఎంసీలో తప్పక చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.

