. . . మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలి
. . . తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని, అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉబర్ సంస్థకు సూచించారు. ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి తో జూబ్లీహిల్స్ నివాసంలో బుధవారం భేటీ అయింది. ఉబర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి వివరించారు. హైదరాబాద్ లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు ఖోస్రోషాహి తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిని వ్యక్తీకరించారు. భవిష్యత్తులో మరింత విస్తరణ చేపడుతామని తెలిపారు. అందుకు ప్రభుత్వ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి ని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఉబర్ ప్రతినిధులకు సూచించారు. తగిన పార్కింగ్ సౌకర్యాలు లేక మెట్రో స్టేషన్ల వంటి ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యమంత్రి సూచనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధి బృందం తెలిపింది. హైదరాబాద్‌కు సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల దూరంలోనే చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాధాన్యతను వివరించారు. గత డిసెంబర్‌లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో 100కు పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యాలయ నిర్మాణానికి దారా ఖోస్రోషాహి ఆసక్తి చూపించారు. ఈ సమావేశంలో ఉబర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఉబర్ ఇండియా & సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
