26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పాత కక్షలతో దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రౌడీ షీటర్ అరెస్ట్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పాత కక్షల నేపథ్యంలో ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన రౌడీ షీటర్‌ను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేరానికి ఉపయోగించిన తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పోలీసుల వివరాల ప్రకారం, మహమ్మద్ అర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ఇంటి ప్రహరీ గోడ వివాదానికి సంబంధించిన పాత కక్షలతో నిందితుడు అబ్దుల్ సల్మాన్ ఖాన్ ఈ నెల 22న రాత్రి ఫిర్యాదుదారుడి ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోరిక్షా, విద్యుత్ మీటర్‌ను ధ్వంసం చేసిన అనంతరం అర్షద్ మరియు అతని భార్యపై రాయితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం తల్వార్‌తో బెదిరిస్తూ హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కామారెడ్డి టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బతుకమ్మ కుంట ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తల్వార్‌తో బెదిరించి, రాయితో దాడి చేసిన విషయాన్ని నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 57 సెంటీమీటర్ల పొడవు గల తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటంతో పాటు నేరానికి ఉపయోగించినందుకు భారత ఆయుధాల చట్టం–1959లోని సెక్షన్ 35(1బి)ను కూడా కేసులో చేర్చినట్లు వెల్లడించారు. దర్యాప్తులో అబ్దుల్ సల్మాన్ ఖాన్ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీ షీటర్ అని, గతంలో హత్యాయత్నం సహా ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుశిక్ష కూడా అనుభవించిన చరిత్ర ఉన్నట్లు తెలిపారు. నిందితుడిని వేగంగా గుర్తించి అరెస్ట్ చేసిన కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్‌ఐ సాయికృష్ణతో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఇదే ఉత్సాహంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించినట్లు పేర్కొన్నారు.

More articles

Latest article