. . . విధుల్లో నిర్లక్ష్యం, ఫోక్సో కేసు వ్యవహారంలో ఆరోపణలపై చర్య
సూర్యాపేట, బతుకమ్మ :
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారం సర్కిల్‌కు చెందిన అర్వపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఈటా సైదులను జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం సస్పెండ్ చేసినట్లు సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడం, అలాగే ఓ కీలక పోక్సో కేసు వ్యవహారంలో అనుచిత ప్రమేయం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్సైపై తక్షణ చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పలు కేసులకు సంబంధించిన దర్యాప్తులో ఆధారాల మార్పిడి, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఈటా సైదులుపై వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై ఉన్నతాధికారులు ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా ముందస్తు చర్యగా సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. విచారణ పూర్తయిన అనంతరం మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
