29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సమిష్టి కృషితో ‘అరైవ్ – అలైవ్’ను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్థానిక ప్రజాప్రతినిధులు సహా అందరినీ భాగస్వాములు చేయాలి

 

. . . అధికారులతో సమీక్షలో కలెక్టర్, సీ.పీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ఈ కార్యక్రమం అమలు తీరు గురించి రాష్ట్ర సచివాలయం నుండి  గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్.పీలు, సీ.పీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనూ నానాటికీ రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరుతున్న నేపధ్యంలో వీటి నియంత్రణ కోసం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు వీలుగా, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేలా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు. ఈ సందర్భంగా వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీ.పీ సాయి చైతన్య ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు వీలుగా చేపట్టిన అరైవ్ –  అలైవ్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

 

'Arrive – Alive' must be made a success through collective effort

 

వార్డు సభ్యులు, సర్పంచ్ లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. 13వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. అదేవిధంగా రిటైర్డ్ టీచర్లు, డాక్టర్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులతో కూడిన రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, ఈ కమిటీలో కనీసం ముగ్గురు మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని అన్నారు. ఎక్కడైనా రోడ్ల పక్కన పాడుబడిన బావులు ఉంటే పూడ్చివేయించాలని, ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ చేయించాలని తెలిపారు. 15వ తేదీన చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డేగా జరపాలని, 4 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన పిల్లలకు సైతం వాహనాలపై తీసుకెళ్ళే సమయంలో వారికి కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. మైనర్ లు వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వంటి వాటి గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. స్కూల్ బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉండేలా చూడాలన్నారు. 16 తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారు ప్రజలకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. అలాగే, వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కాగా, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాలలో తక్షణమే స్పందించి ప్రథమ చికిత్స ఎలా చేయాలి, క్షతగాత్రులను సత్వరమే సమీప ఆసుపత్రికి తరలించడం, రహ్ వీర్ కింద ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకం గురించి 17వ తేదీన శిక్షణ, అవగాహన  కార్యక్రమాలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ప్రమాదాల నివారణకు కృషి చేసిన వారిని గుర్తించి సన్మానించాలని సూచించారు. 18వ తేదీన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిని గుర్తిస్తూ, వారికి కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 16న మండల స్థాయిలో నిర్వహించే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సభల్లోనూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రధాన కూడళ్ళలో మానవహారాలు జరపాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

'Arrive – Alive' must be made a success through collective effort

More articles

Latest article