ఒకరినొకరు తోసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు
– మెండోరా. ముప్కాల్ మండలాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
బతుకమ్మ, మెండోరా, ముప్కల్: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం రైతు వేదికలలో బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ముప్కాల్ రైతు వేదికలో చెక్కుల పంపిణీ సమయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులకు లక్ష చెక్కులతోపాటు తులం బంగారం అందజేస్తామని హామీ ఇచ్చి బంగారం ఇవ్వకుండా మోసం చేశారనడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు లేచి గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారంటు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో బి ఆర్ ఎస్ కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకు వచ్చారు. రెండు పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బదనం చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకెళ్లారు. మంత్రిగా ఉండి ఎన్ని డబుల్ బెడ్ రూములు ఇచ్చారని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని నిలదీశారు. దీంతో ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి కలుగజేసుకొని రెండు పార్టీ కార్యకర్తలను నాయకులను సంపాదించారు. అదేవిధంగా రైతు వేదిక నుండి బయటకు వెళ్ళమని సూచించారు. చెక్కుల పంపిణీ సజావుగా సాగే విధంగా సహకరించాలని కోరారు. దీంతో ఆ పార్టీ వాళ్ళు బయటికి వెళ్తే మేము వెళ్తామని ఒకరినొకరు దూషించుకున్నారు. మరింత ఉద్రిక్తత ఏర్పడడంతో పోలీసులు వారిని బయటికి పంపించేశారు. అనంతరం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా మెండోరా చెక్కుల పంపిణీలో ముందస్తుగా పోలీసులు కార్యకర్తలను ఎవరిని లోనికి రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టింటి ముత్యంరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ నాగంపేట్ శేఖర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి, తహసిల్దార్ లు సంతోష్ రెడ్డి, సీఎచ్.కృష్ణ తదితరులున్నారు.

