. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
హైదరాబాద్, బతుకమ్మ :
కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు తక్షణమే పరిపాలనా, ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయాలని, అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో నూతన ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ఈ భేటీలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పలు కీలక అభివృద్ధి ప్రతిపాదనలతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు పరిపాలనా ఆమోదం, నిధుల మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ – ఉప్పల్వాయి ప్రధాన రహదారిపై సర్వాపూర్ – మొండిసడక్ మధ్య హై లెవల్ బ్రిడ్జి, గాంధారి – తిమ్మాపూర్ మధ్య మరో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలని కోరారు. ఈ వంతెనలు నిర్మితమైతే వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు. విద్యా రంగ అభివృద్ధిలో భాగంగా గాంధారి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే లింగంపేట, సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి మండలాల్లో శిథిలావస్థకు చేరుకున్న ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాల స్థానంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐఓసీ) భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సమర్పించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా పరిశీలించి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా అమలు చేస్తూ, అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
