. . . రాష్ట్రంలోనే తొలిసారిగా సర్పంచ్ లు, ట్రాన్స్ జెండర్ లతో సమావేశం
. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ చొరవతో సమసిన వివాదం
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాలలో ఇటీవల ట్రాన్స్ జెండర్ ల రాకపై గ్రామ కమిటీలు నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం విషయమై జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ట్రాన్స్ జెండర్లు, గ్రామ సర్పంచ్ లతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సిరికొండ మండలం మైలారం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన ఉదంతాలపై ఎంతో సంయమనంతో కలెక్టర్ ఇరు వర్గాల వాదనలు విన్నారు. వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి సమయాలలో ట్రాన్స్ జెండర్ లు గ్రామాల్లోకి వచ్చి బలవంతంగా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే అనుచిత ప్రవర్తనతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆయా గ్రామాల సర్పంచ్ లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ట్రాన్స్ జెండర్ల వేషధారణలో కొంతమంది నకిలీలు సైతం వస్తున్నారని, వారి వల్ల మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. అందువల్లే గ్రామస్తుల ఏకాభిప్రాయం మేరకు ట్రాన్స్ జెండర్ల రాకపై నిషేధం విధిస్తూ తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. అయితే ఈ బహిష్కరణ నిర్ణయాల వల్ల తాము గ్రామాలకు వెళ్లలేకపోతున్నామని, తమ గౌరవానికి భంగం కలుగుతోందని, జీవనోపాధి కోల్పోయామని ట్రాన్స్ జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేషధారణలో కొంతమంది నకిలీలు వ్యవహరిస్తున్న అసంబద్ధ వైఖరి కారణంగా తమపై ఆంక్షలు విధించడం భావ్యం కాదని ఆవేదన వెలిబుచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న మీదట కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సయోధ్య కుదిర్చారు. నకిలీల బెడదను నివారించేందుకు అర్హత కలిగిన వాస్తవంగా ట్రాన్స్ జెండర్లు అయిన వారికి సమగ్ర నిర్ధారణ చేసి జిల్లా సంక్షేమ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ ఐ.డీల ద్వారా నకిలీలను సులభంగా గుర్తిస్తూ వారి బెడదను నివారించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రాన్స్ జెండర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు బలవంతపు వసూళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, ఇష్టపూర్వకంగా ఇచ్చినది తీసుకోవాలని ట్రాన్స్ జెండర్లకు హితవు పలికారు. సమాజంలో అనేక మంది ట్రాన్స్ జెండర్లను శివాసత్తులుగా కొలుస్తూ, తమకు తోచిన మేరకు డబ్బులు ఇస్తుంటారని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని హితవు పలికారు. ఇకపై ఎక్కడ కూడా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయవద్దని సూచించారు. ఇందుకు ట్రాన్స్ జెండర్లు అంగీకరిస్తూ, ఇకపై తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాలలో వారి రాకపై నిషేధం విధిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించి, ఆంక్షలను ఎత్తివేసేందుకు గ్రామ సర్పంచ్ లు అంగీకారం ప్రకటించారు. ఎంతో సున్నితమైన సమస్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవ చూపి తనదైన శైలిలో పరిష్కరించడం పట్ల ట్రాన్స్ జెండర్లు, సర్పంచ్ లు జిల్లా పాలనాధికారికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, డీ.డబ్ల్యూ.ఓ పద్మ , ఏ.ఓ రాజబాబు, డీఎల్పీఓలు, ట్రాన్స్ జెండర్లు, ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.

