భీమ్ గల్, బతుకమ్మ :
ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి కార్యక్రమాన్ని భీమ్ గల్ పట్టణంలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కొరవి గోపరాజు సాహితీ, సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ అందెశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ వాగ్దేయకారుడు, ప్రజాకవి, సహజ కవి, ప్రకృతి కవి, ఉత్తమ గీత రచయిత, నంది అవార్డు గ్రహీత, తెలంగాణ మాతృ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందె ఎల్లమ్మ, బుడ్డయ్య దంపతులకు 1961 జూలై 18న జన్మించారన్నారు. పశువుల పాలేరు నుండి ప్రజాకవిగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం “జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం” ను రచించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ఎలాంటి విద్యను అభ్యసించకుండా మూడు వేల కవితలు, సినిమా పాటలు వ్రాసి, కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ చేసిన సేవలను గుర్తించి 2025 జూన్ 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అందెశ్రీకి కోటి రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం ప్రదానం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ ఉపాధ్యక్షుడు తీగల రఘు, డప్పు ప్రశాంత్, నిచ్చేమోల్ల మహేష్, కొండ సాయికిరణ్, గజ్జెల విగ్నేష్ (భరత్), సున్నపు సాయి కుమార్ పాల్గొన్నారు.
