నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని గిరిరాజ్ కళాశాల(స్వ)లోని భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోహం అకాడమీ, హైదరాబాద్ వారి సౌజన్యంతో రోబోటిక్స్ పై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. కార్యశాలను ప్రారంభిస్తూ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రంగరత్నం మాట్లాడుతూ నేడు అన్ని రంగాలలో రోబోటిక్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకుందని, భవిష్యత్తులో దాదాపు మన అన్ని దైనందిన కార్యక్రమాలలో రోబోల వాడకం సర్వసాధారణమవుతుందని తెలిపారు. ఈ కార్యాశాలలో 70 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, ట్రైనర్లుగా సోహం అకాడమీ ప్రతినిధులు సందీప్, మల్లికార్జున్, రాజ వర్ధన్, అక్షయలు వ్యవహరించారు. ఆర్డినో యూనో మైక్రో కంట్రోలర్ పై 21 రకాల ప్రయోగాలను విద్యార్థులకు నేర్పించామని కార్యశాల సమన్వయకర్త డాక్టర్ పి.రామకృష్ణ తెలియజేశారు. శిక్షణ పొందిన ఈ విద్యార్థులు నిజామాబాద్ పరిసరాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇచ్చే అభ్యర్థులకు తగిన పారితోషికం కూడా అందిస్తామని, అలాగే భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కూడా చేస్తామని సోహం అకాడమీ డైరెక్టర్ కొమరగిరి సహదేవ్ తెలియజేశారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, ఐక్యూఏసీ సమన్వయకర్త డాక్టర్ రాజేష్, గణిత విభాగాధిపతి జయప్రసాద్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి కిరణ్ కుమార్ గౌడ్, అధ్యాపకులు పద్మ, రాములు, వాణి, ఆస్ర పాల్గొన్నారు.