. . . స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
వెబ్ డెస్క్, బతుకమ్మ :
అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కె. చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) భరత్ డాకాతో ముఖ్యమంత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం గురించి స్కైరూట్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), అలాగే ప్రభుత్వం–ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి అభినందించారు. వారు సాధించిన విజయం భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుందని ప్రశంసించారు. అలాగే, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ తెలంగాణను దేశంలో ప్రముఖ టెక్నాలజీ, స్పేస్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.