దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

 

. . . లక్షల విలువైన వస్తువులు రికవరీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు దొంగతనం ఘటనలను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, దొంగిలించిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్, ఐదవ టౌన్ ఎస్‌ఐ డి.సునీల్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, మంగళవారం నాగారం చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక కంప్యూటర్ మానిటర్‌ ను తీసుకుని అనుమానాస్పదంగా వెళ్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు వన్నె విశ్వజిత్ (23), షేక్ హఫీజ్ (18) గా గుర్తించారు. విచారణలో నిందితులు జులై 23 న రాత్రి బ్రహ్మన్స్ కాలనీ చౌరస్తాలోని ఓ గది తాళాన్ని రాయితో పగులగొట్టి లోపల ఉన్న శామ్‌సంగ్ మానిటర్, డెల్ ఆప్టిప్లెక్స్ 7010 సీపీయూ, హెచ్‌పీ కీబోర్డ్, ఓరియంట్ ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్‌ ను దొంగిలించినట్లు అంగీకరించారు. అలాగే జులై 25 తెల్లవారుజామున న్యాల్‌కల్ రోడ్డులో పార్క్ చేసిన మూడు వాహనాల్లో రెండు వాహనాల బ్యాటరీలను దొంగిలించి, వాటిని అసద్ బాబా నగర్‌లోని షేక్ షకీల్ స్క్రాప్ షాప్‌ లో విక్రయించి రూ.2,100 తీసుకున్నట్లు తెలిపారు. దొంగిలించిన శామ్‌సంగ్ మానిటర్‌ ను విక్రయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో మంగళవారం సాయంత్రం నాగారం చౌరస్తా వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో వారు నేరాలను స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుంచి శామ్‌సంగ్ కంపెనీ మానిటర్, హెచ్‌పీ కంపెనీ కీబోర్డ్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మిగిలిన దొంగిలించిన వస్తువులు ఇంట్లో దాచినట్లు నిందితులు చెప్పడంతో, పంచుల సమక్షంలో 300 క్వార్టర్స్, నాగారం ప్రాంతంలోని విశ్వజిత్ ఇంటికి వెళ్లి అక్కడ నుంచి డెల్ ఆప్టిప్లెక్స్ 7010 సీపీయూ, ఓరియంట్ ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం శామ్‌సంగ్ మానిటర్, డెల్ ఆప్టిప్లెక్స్ 7010 సీపీయూ, హెచ్‌పీ కీబోర్డ్, ఓరియంట్ ఎలక్ట్రిక్ టేబుల్ ఫ్యాన్‌ లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్, ఐదవ టౌన్ ఎస్‌ఐ డి. సునీల్ తెలిపారు.

Two youths arrested for committing thefts.
Comments (0)
Add Comment