. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
వెబ్ డెస్క్, బతుకమ్మ :
నేరెళ్ల ఘటనలో మృతిచెందిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె, నేరెళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ కుటుంబంలో తాను కూడా సభ్యురాలినేనని పేర్కొంటూ, ఆ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బాధితులకు క్షమాపణలు చెబుతున్నానని కవిత అన్నారు. ఇసుక అక్రమ రవాణా, ధనదాహం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల ఘటనలో బాధితులపై దాష్టీకానికి పాల్పడిన పోలీసు అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. అలాగే ధనదాహంతో ప్రాణాలు తీసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఎందుకు లేవని నిలదీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌లను ఉద్దేశించి బాధితులకు న్యాయం చేయడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. జాతీయ ఎస్సీ కమిషన్ నేరెళ్ల ఘటనపై విచారణ జరిపినా, ఇప్పటి వరకు నివేదిక వెలువడకపోవడంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీ వెళ్లి ఎస్సీ కమిషన్ నివేదిక కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. మానవ హక్కుల కమిషన్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ, కేవలం ఒక ఎస్సైపై చర్య తీసుకుని అసలు బాధ్యులను వదిలేశారని కవిత ఆరోపించారు. ఎన్నికల సమయంలో నేరెళ్ల బాధితుల పేరును ప్రస్తావించిన నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. చనిపోయిన గంధం గోపాల్ కుటుంబం తొమ్మిదేళ్లుగా న్యాయం కోసం, వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదని ఆమె అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని, పిల్లల విద్యా బాధ్యతను ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల ఘటనకు రాజకీయ రంగు పులమకుండా అన్ని రాజకీయ పార్టీలు మానవత్వంతో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన నినాదమైన “ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కారిస్తాం”కు అనుగుణంగా నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.