గత నెల 31న ఈఈ రిటైర్ మెంట్
ఇంచార్జిని నియమించిన విధుల్లో చేరని వైనం
నిజామాబాద్, బతుకమ్మ
నిజామాబాద్ నీటి పారుదల శాఖ డివిజన్ -2 ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎవరనే చర్చ జరుగుతుంది. నిజామాబాద్ డివిజన్ నం.2 ఈఈగా ఉన్న అశోక్ కుమార్ గత నెల 31న పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో ఆర్మూర్ ఈఈ రామారావుకు పూర్తి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రామారావు ఇప్పటి వరకు చార్జీ తీసుకోలేదు. దానితో నిజామాబాద్ ఈఈ పోస్టుపై సందిగ్ధం నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు తోడు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు చెరువులు, రిజర్వాయర్లు మత్తడిపోశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకున్నా జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికి జిల్లాలో భారీ వర్షాల సూచనలు కొనసాగుతున్నాయి. కానీ సంబంధిత నీటి పారుదల శాఖకు కీలకమైన అధికారి లేకపోవడంతో అజామాయిషి కరువైంది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నతాధికారులు ఉన్నా ఈఈ స్థాయి అధికారి పోస్టు రెండు వారాలుగా ఖాళీగా ఉండగా ఎందుకు అక్కడ అధికారులను నియమించడం లేదని ఆ శాఖలో చర్చ మొదలయింది. ప్రధానంగా వర్షాకాలంలో సంబంధిత కీలక పోస్టులో అధికారి విధుల్లో చేరకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చర్చ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా చేపట్టి చెరువులు, వాగులు, వంకలు కబ్జా చేసిన వారి చెర నుంచి విడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. నిజామాబాద్ డివిజన్ లోనూ చెరువులు,కుంటలు, కాలువలు కబ్జాలకు గురయ్యాయి. ఇటీవల రెవెన్యూ, మున్సిపల్, పంచాయితీ, నీటి పారుదల శాఖాధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహిస్తుండగా నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరింగ్ స్థాయి అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో కబ్జాల లెక్కలు చెప్పే వారే కరువయ్యారు. ఈ విషయంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు డివిజన్ లో ప్రధానంగా నీటి పారుదల శాఖలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తమౌతుంది.