. . . ఓటర్ల నమోదు జాబితాలో ఉన్న చిన్న చిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలి.
. . . 5 శాతానికి మించి ‘పెర్మనెంట్ షిఫ్టింగ్’ ఉన్న బూత్‌లను మళ్లీ వెరిఫై చేయాలి
. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, బతుకమ్మ :
బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం కమ్మర్‌పల్లి, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా మండల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఆయన, సంబంధిత తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఎస్ ఐ ఆర్ నమోదు ప్రక్రియ పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, ఏ ఎస్ డి (డెత్, డబుల్, షిఫ్టెడ్) వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని వివరించగా, నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా నో మ్యాపింగ్,డెత్, డబుల్, షిఫ్టెడ్ (ఏ ఎస్ డి ) కేటగిరీల్లో నమోదైన ప్రతి కేసును పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89 శాతం మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ శాతం కంటే తక్కువగా నమోదు జరిగిన పోలింగ్ బూత్‌ల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా బూత్‌లలో నమోదు శాతం ఎందుకు తగ్గిందో ప్రత్యేకంగా పరిశీలించి, మిగిలిన అర్హులైన ఓటర్లను గుర్తించి ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా, 2002 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ‘నో మ్యాపింగ్’ ఓటర్లు 5 శాతానికి మించి ఉన్న పోలింగ్ బూత్‌లు, అలాగే ‘పెర్మినెంట్ షిఫ్టెడ్’ ఓటర్లు 5 శాతానికి మించి నమోదైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు.ఇంకా సమయం ఉన్నందున సాంకేతిక లోపాలు, సమాచార పొరపాట్లు లేదా ఇతర కారణాల వల్ల నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా మరోసారి క్షేత్రస్థాయిలో ధృవీకరణ చేపట్టాలని కోరారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంకా నమోదుకాని అర్హులైన ఓటర్లను గుర్తించి, బీఎల్ ఏ లు, బీయెల్ ఓ లు, రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. “ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా నమోదు కాకుండా మిగలకూడదన్నారు. ప్రతి ఓటరు హక్కు పరిరక్షించబడాలని, అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం” అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, దానిని పరిరక్షించడం బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా తమ కర్తవ్యమని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ,ఇందులో భాగంగానే నేడు బాల్కొండ, మెండోరా మండలాల తహసీల్దార్లను కూడా స్వయంగా కలిసి ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున విన్నవించామని,అలాగే నియోజకవర్గం లోని మిగతా అన్ని మండలాల్లో కూడా ఇలాగే అందజేస్తామని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందేలా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.