కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ దిష్టి బొమ్మలు దగ్ధం
నిజామాబాద్, బతుకమ్మ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నగరంలో మాల సంఘాల జే ఏ సి ఆధ్వర్యంలో గురువారం నిరసనలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈసందర్భంగా అల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ( ఆంసా) రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ గతంలో ఆరు శాతం మాలలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు దానిని 5 శాతానికి తగ్గించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి ఉప వర్గీకరణను చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు నిరసనగా రాబోయే ఎమ్మెల్సీ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాలలు పని చేయాలని కోరారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎల్లము మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మాల (టీమ్) నాయకులు అలుక కిషన్ దేవదాస్ లు మాట్లాడారు. కార్యక్రమంలో అలుక కిషన్, దేవదాస్, ఉదయ్, నాగరాజు, స్వామిదాస్, ఎల్లం, రాజు తదితరులు పాల్గొన్నారు.