ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి

 

. . . జూలై 10న విద్యా సంస్థలు బంద్ పాటించాలి

 

. . . వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు కోరారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 10న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం కోసం బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. జూలై 10 న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి పలు డిమాండ్లు వినిపించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేలా సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుని అవసరమైతే మూసివేయాలని కోరారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి జి. సురేష్, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్, ఏఐఎస్‌ఎఫ్ కామారెడ్డి ఏరియా అధ్యక్షుడు శివ, కార్యదర్శి సంపత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు నితిన్, ఏఐఎస్‌బీ జిల్లా నాయకుడు నిఖిల్ గౌడ్, నాయకుడు రోహిత్, పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

The public education system must be strengthened.
Comments (0)
Add Comment