. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
జక్రాన్ పల్లి, బతుకమ్మ:
వసతి గృహాలు, పాఠశాల, రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. జక్రాన్పల్లి మండలం మునిపల్లి లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్/డిగ్రీ కళాశాల ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులు తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సదుపాయాల గురించి ఆరా తీశారు.
వసతి గృహాల పరిసరాల పరిశుభ్రతపై కలెక్టర్ అసంతృప్తి…..
వంట గది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ అపరిశుభ్రంగా ఉంది, ఈగలతో నిండి ఉండడాన్ని గమనించి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత గురించి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న దున, ఏజెన్సీని మార్చాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధులు ముప్పిరిగొనే ప్రమాదం ఉన్నందున పరిశుభ్రత విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణలో రాజీ పడవద్దని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపిస్తూ, శుచి, శుభ్రత తో కూడిన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.
అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం బై.పీ.సీ తరగతి గదిని సందర్శించి, విద్యార్థినులతో భేటీ అయ్యారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, విద్యార్థినుల నుండి సమాధానాలు రాబట్టారు. ప్రతిభ చూపిన బాలికలకు బహుమతులు అందించి ప్రోత్సహించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ అనూష తదితరులు ఉన్నారు.