ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి

 

. . . తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశం

నిజామాబాద్, బతుకమ్మ :

ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్దిదారులకు ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసీల్దార్లకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, లబ్దిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చే వారికి సరిపడా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్దిదారులకు ఇసుకను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేకంగా జారీ చేసిన వే బిల్లులను అందించాలని, అనుమతుల విషయంలో అనవసర ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరిట ఇసుక పక్క దారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ఎంపీడీఓలు, ఎంపీఓలను సంప్రదించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. వర్షాలు ప్రారంభం అయితే వాగులు, నదులలో వరద జలాలు చేరుకొని ఇసుక లభించే పరిస్థితి ఉండదని, దీనిని దృష్టిలో పెట్టుకుని వానలు కురియకముందే సరిపడా ఇసుక నిల్వలను ఇందిరమ్మ లబ్ధిదారులు ముందస్తుగా సమకూర్చుకునేందుకు వారికి వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఎక్కడ కూడా ఇసుక కొరత కారణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ పాల్గొన్నారు.

Sand should be made available to Indiramma House beneficiaries
Comments (0)
Add Comment