. . . 33 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అనేక ఒడుదుడుకులు
. . . ఎంపీఓ రాజ్ కాంత్ రావు కు ఘనంగా పదవీ విరమణ సన్మానం
ఇందల్వాయి, బతుకమ్మ
పంచాయతీ శాఖలో సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా విశిష్ట సేవలు అందించిన మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) ఎమ్.రాజ్ కాంత్ రావు శనివారం ఉద్యోగ పదవీ విరమణ చేశారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
. . . బిల్ కలెక్టర్ స్థాయి నుండి ‘మండల అధికారి’ వరకు
గత 33 సంవత్సరాల క్రితం పంచాయతీ శాఖలో సాధారణ బిల్ కలెక్టర్‌గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన రాజ్ కాంత్ రావు, తన అంకితభావం, కష్టపడే తత్వంతో క్రమంగా పదోన్నతులు పొందుతూ ఎంపీఓ స్థాయికి ఎదిగారు. క్షేత్రస్థాయి నుండి మండల స్థాయి వరకు గ్రామాల్లోని మౌలిక వసతుల కల్పన, పంచాయతీల అభివృద్ధి, పల్లెల ప్రగతిలో ఆయన పోషించిన పాత్ర ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. ఈ సన్మాన మహోత్సవంలో పాల్గొన్న పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు రాజ్ కాంత్ రావు సేవలు అభినందనీయమని ఆయనతో ఉన్న వృత్తిపరమైన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం రాజ్ కాంత్ రావు దంపతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించి ఘనంగా వీడ్కోలు పలికారు. సమర్థవంతమైన సేవలు అందించి రిటైర్ అవుతున్న రాజ్ కాంత్ రావు ఇకపై తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, ప్రశాంతమైన శేషజీవితాన్ని గడపాలని సహోద్యోగులు, స్థానిక ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో అనంతరావు, డి ఎల్ పి ఓ శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సుదర్శన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.