. . . బోలేగాం నుంచి బోధన్ కు అక్రమ ఇసుక రవాణా ?
. . . టారజ్ కు రూ.10 వేలు, టిప్పర్ కు రూ.8 వేలు
. . . సాలురాలో కప్పం కడితేనే ఇసుక హద్దులు దాటేది
నిజామాబాద్ , బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో ఇసుక రీచ్ లు ఉన్నాయి. మంజిరా, గోదావరి నది పరివాహక ప్రాంతం ఉండనే ఉంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళతో పాటు ప్రభుత్వ అవసరాలకు ఇసుకను తవ్వుకుని తరలించేందుకు వే బిల్లులు మంజూరు చేస్తునే ఉంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, పోతంగల్, కోటగిరి, బిచ్కుంద, బీర్కూర్ మండలాల్లో అధికారికంగానే ట్రాక్టర్లలో ఇసుకను తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వగా యంత్రాలను పెట్టి టిప్పర్లలో, టారజ్ లలో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. అసలే జలవనరులు అడుగంటుతున్నాయని ఆయా గ్రామ శివారు రైతులు పర్యావరణ వేత్తలు లబోదిబోమంటున్న ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. తెలంగాణలో ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇసుక తవ్వకాలే అనుమతి ఒక విధంగా, తవ్వకాలు మరో విధంగా సాగుతుంటే పొరుగున ఉన్న మహారాష్ట్ర ఇసుక ఇప్పుడు నిజామాబాద్ కు తరలివస్తుంది. నిజామాబాద్ సరిహద్దులోని సాలురా చెక్ పోస్టు వద్ద ప్రైవేట్ వ్యక్తులకు కప్పం కడితేనే ఇసుక హద్దులు దాటడం విశేషం. ఇసుక తవ్వకాలు, తరలింపుపై నిఘా కోసం మైనింగ్ శాఖ వే బ్రిడ్జి ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా సాగుతుంది.
మహారాష్ట్రలోని బోలేగావ్ మంజీరా ప్రాంతం నుంచి ప్రతి రోజు రాత్రి ఇసుక టారస్ వాహనాలు తెలంగాణ సరిహద్దులు దాటి అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఎలాంటి భయం లేకుండా ఈ వాహనాలు తెలంగాణలోకి వస్తున్నప్పటికీసంబంధిత శాఖల అధికారులు సమర్థవంతమైన నిఘా ఏర్పాటు చేయడం లేదని విమర్శలున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని సాలురా వద్దనే ఇసుక వాహనాలకు కప్పం వసూల్ చేస్తున్నారని జగమెరిగిన సత్యం. మహా వాహనాలు తెలంగాణలో ప్రవేశించాలంటే సాలురా వద్ద ప్రైవేట్ వ్యక్తులకు టారజ్ కు రూ.10 వేలు, టిప్పర్ కు రూ.8 వేలు ఇవ్వాల్సిందే. లేకపోతే బోధన్ బైపాస్ సరిహద్దులు దాటకముందే అధికారులు వాటిని సీజ్ చేసేస్తారు. ఎందుకంటే కప్పం వసూల్ చేసేందుకు ఏర్పాటైన గ్యాంగ్ తో అధికారులు మిలాఖత్ అయ్యారని ఆరోపణలున్నాయి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు ఇసుక దందా చేసే వ్యాపారులు మహారాష్ట్రలో టెండర్ ద్వారా ఇసుక రీచ్ లను దక్కించుకున్నారు. అందులో కొందరు ముదుర్లు ఉండడం, అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉండడంతో ఇసుక వాహనాలు మహారాష్ట్రకు వెళ్లకుండా హద్దులను దాటి నిజామాబాద్, బోధన్, నిర్మల్ జిల్లాలకు తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. గత కొన్ని రోజుల క్రితం బోధన్ బైపాస్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ టారజ్ వాహనాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు అప్పగించిన ఘటన తెలిసిందే. ఈ ఘటనతో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా అదే తరహాలో ఇసుక టారజ్ వాహనాలు సరిహద్దులు దాటి వస్తున్నాయి. ప్రతి రోజు వాహనాలు సరిహద్దులు దాటుతున్నాయని ఆరోపణలు ఉన్నప్పటికీసంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.