యూరియా కొరత అధిగమించేది ఎలా..?

  • రోడ్డెక్కుతున్న అన్నదాతలు
  • ఆదిలోనే రైతులకు ఎరువుల కష్టాలు

 

నిజామాబాద్, బతుకమ్మ : ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. వానా కాలంలో పంటలు వేయకముందే యూరియా కొరత నేపథ్యంలో రోడ్డెక్కుతున్నారు. ఈ నెల 1న గాంధారి మండల కేంద్రంలో రైతులు యూరియా కొరత విషయంలో రాస్తారోకో చేశారు. మంగళవారం ఆర్మూర్ సహకార సంఘం వద్ద రైతులకు సరిపడ ఎరువులు లేకపోవడంతో సొసైటీ ఎదురుగా బైటాయించి నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటలు పండించే సమయంలో అవసరమైన ఎరువులు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల వద్ద కొందామంటే ధరలు అధికంగా ఉంటాయని సొసైటీల వద్ద కొనుగోలుకు ముందస్తుగా ఎదురు చూస్తుంటే వారికి సరిపడ ఎరువులు దొరకకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరిపంట సాగుకు ఎకరానికి 4 యూరియా బస్తాలు అవసరం కాగా నాలుగు దశల్లో రైతులకు ఎరువులను అందించాల్సిన యంత్రాంగం సగానికి పైగా ఎరువులు వచ్చినా రైతులకు అందించడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల 60 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా ఉంది. అందలో 4 లక్షల 36 వేల ఎకరాల్లో వరి సాగుకు సమాయత్తం అవుతున్నారు రైతులు. జిల్లాలో ఈ సీజన్ కు 75 వేల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం కాగా 46 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా అయ్యాయి. అందులో 26 వేల మెట్రిక్ టన్నులను సొసైటీలకు పంపిణీ చేశారు. కానీ రైతులకు చేరకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు ఖరీఫ్ సీజన్ లో 68 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉండగా ఇప్పటి వరకు 30 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రధానంగా వరికి ఎరువులు అవసరం ఉండగా రైతుల అవసరాలు తీర్చే విధంగా యూరియా సరఫరా లేదన్నది ప్రధాన వాదన. అంతేగాకుండా రైతులకు ఈసారి మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరాపై ఇంకా స్పష్టత రాలేదన్న అనుమానాలున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రాజకీయ రంగు పులుముకుంది. ఉమ్మడి జిల్లాలోని సొసైటీల అవినీతి వల్లనే ఎరువుల కొరత అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • ఒక్క డీఏపీ బస్తా కావాలంటే.. గుళికల బస్తా తీసుకోవాల్సిందే..

ఫర్టిలైజర్ లలో రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే మరొక ఎరువులు కొనాలని కొర్రీలు పెడుతున్నారు వ్యాపారులు. అవసరమున్న లేకున్నా తప్పనిసరిగా,తీసుకోవాల్సిన పరిస్థితిని తీసుకువస్తున్నారు. ఒక డిఎపి బస్తా కొంటే తప్పనిసరిగా ఐదు కిలోల గుళికలు, లేక జింకు తీసుకోవాలని నిబంధనలు పెట్టారు. జింకు, గుళికలు అవసరం లేకున్నా, రైతులకు బలవంతంగా ఎరువుల వ్యాపారస్తులు అంట కడుతున్నారు. సంబంధిత గుళికల కంపెనీ యజమానులు, జింకు కంపెనీ యజమానులు తమ సరుకు అమ్ముడు పోవడానికి ఎరువుల వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున కమిషన్లు అందజేసి, లేకుంటే ఎక్కువ మొత్తంలో అమ్మితే, విదేశీ పర్యటనలు చూపెడుతూ తమ సరుకు పెద్ద ఎత్తున అమ్ముడు పోవడానికి ఆయా కంపెనీలుప్రయత్నాలు జరుపుతున్నారు. తమకు డిఐపి బస్తా చాలు అంటే ఐదు కిలోల గుళికల బస్తా తీసుకుంటేనే డీఏపీ బస్తా ఇస్తామని ఎరువుల వ్యాపారస్తులు ఖరాకండిగా రైతులకు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతు డి ఎ పి బస్తాలతో పాటు గుళికలు తీసుకోవాల్సిన అవసరం కల్పిస్తున్నారు. ఒక డిఏపి బస్తా ధర 135రూపాయలు ఉండగాఅదేవిధంగా 500రూపాయలు వెచ్చించి గుళికల బస్తా తీసుకోవాల్సిన అవసరం రైతులకు ఏర్పడుతుంది. అసలు గుళికలు గాని జింకు గాని రైతులకు అవసరం లేనప్పటికీ ఆ సరుకు అమ్ముడు పోవడానికి ఈ లింకు పెడుతున్నారు. దీనివల్ల రైతులు ప్రతి బస్తా వెనుక 500రూపాయలు నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ప్రైవేట్ ఎరువుల వ్యాపారస్తులు ఈ దందా కొనసాగిస్తున్నారు.  కానీ వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలపై పర్యవేక్షణ లేకపోవడం నెల నెల మామూలు అందుకుంటూ ఎరువుల వ్యాపారస్తులకు అండగా నిలుస్తున్నారు. ఫలితం అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నారు.

How to overcome urea shortage?
Comments (0)
Add Comment