27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏకగ్రీవంలో హస్తముద్ర

Must read

📰 Generate e-Paper Clip

 . . . ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవ సర్పంచ్ లు కాంగ్రెస్ దే పై చేయి

 

. . . బోని కొట్టని కమలం పార్టీ

 

. . . కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవం

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ తనదైన ముద్ర వేసుకుంది. గత నెల 25న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెల్సిందే. ముందుగా పంచాయితీలకు ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు విడతల్లో జరిగే పంచాయితీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదిల్లో జరుగనున్నాయి. గడిచిన నెల నుంచి పంచాయితీలకు, వార్డు మెంబర్లకు నామినేషన్లు స్వీకరించిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయితీలకు, 5022 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 532 పంచాయితీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా వార్డులకు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణ గడువు ముగిసింది. అయితే చాలా మట్టుకు ప్రాంతాల్లో నామినేషన్ల ఉపసంహరణతో కొన్ని పంచాయితీలకు ఏకగ్రీవంగా సర్పంచ్ లు, వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు.

పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చూపుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏకగ్రీవానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 46 గ్రామాలలో సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ అధికార పక్షానికి ఎదురు లేకుండాపోయింది. నాగిరెడ్డిపేట్ లో 6, లింగంపేట్ లో 14, గాంధారిలో 16, ఎల్లారెడ్డిలో 5, సదాశివనగర్ లో 3, రాజంపేట్ లో 2 పంచాయితీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇదే దోరణిలో బాన్సువాడ నియోజకవర్గంలోనూ అత్యధిక పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. దాని తర్వాత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనూ సర్పంచ్ స్థానాలు ఎక్కువగా ఏకగ్రీవమయ్యాయి. తక్కువగా జుక్కల్, బోధన్ నియోజకవర్గంలో సర్పంచ్ లు ఏకగ్రీవం అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. సంబంధిత రెండు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ బలంగా ఉండగా దానికి బీజేపీ తోడుకావడంతో రెండు నియోజకవర్గాల్లో బోని చేసేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. బాల్కొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఎదురుగాలి తప్పడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే గట్టిపోటీ ఇస్తామని చెప్పిన కమలనాథులు పంచాయితీ ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పటి వరకు బోని చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, బీఆర్ఎస్ ను దాటి అధికార పార్టీకి గట్టిపోటీని ఇవ్వడం కొసమెరుపు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవ జాబితాలో లేకపోయినప్పటికీ నేరుగా జరిగే పంచాయితీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కమలం పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఖాతా తెరిచేందుకు ఆపసోపాలు పడుతుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఒకటి, రెండు పంచాయితీలలో ఖాతా తెరిచిన బీఆర్ ఎస్ రూరల్ లో బాజిరెడ్డి రంగంలోకి దిగడంతో కొన్ని పంచాయితీలను ఏకగ్రీవం చేసింది. ఎన్నికలు జరుగనున్న మూడు విడతల్లో ఫలితాల నాటికి సత్తా చాటేందుకు బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల తాజామాజీలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

Handshake in unison

More articles

Latest article