. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర వివాదాలు
. ఎదుటి వారిని హతమార్చేందుకు సిద్ధమవుతున్న వైనం
. అచేతనావస్థలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు
. అన్నీ తెలిసి కళ్లు, చెవులు మూసుకుంటున్న అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ: భూమి కన్నా ఏదీ ఎక్కువ కాదని, తాము చచ్చేందుకైనా.. ఎదుటి వ్యక్తిని చంపేందుకైనా సిద్ధమంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏకంగా పేరు మోసిన పొలిటికల్ లీడర్లపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో అదే స్థాయిలో వివాదాలూ రాజుకుంటున్నాయి. సమస్యలు పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం కళ్లు, చెవులు మూసుకుంటున్నాయని, ఏదో ఒక వర్గానికి కొమ్ముకాస్తుండడమే వివాదాలకు కారణమవుతోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
. తన 70 గజాల ప్లాటును నిజామాబాద్ నగర మేయర్ భర్త దండు శేఖర్ అనుచరులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్ ఒకరు ఏకంగా శేఖర్ పై మారణాయుధంతో దాడి చేశాడు. అయితే తమకు ప్లాటుతో ఎటువంటి సంబంధం లేదని, ఈ దాడి వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని శేఖర్ అనుచరులు ఆరోపించారు. ఈ ఘటన మరువక ముందే మోపాల్ మండలం సిర్పూర్ లో మాజీ ఎంపీపీ భర్త బొడ్డు గంగారెడ్డిపై పలువురు దాడి చేయడం కలకలం రేపింది. పదేళ్ల క్రితం 12 ఎకరాల భూమిని గంగారెడ్డి కొనుగోలు చేశాడు. ఆ తరువాత తన అవసరాల నిమిత్తం 6 ఎకరాలను సప్తగిరి అనే వ్యక్తికి విక్రయించి.. మిగతా భూమిని కౌలుకు ఇచ్చాడు. గంగారెడ్డి వద్ద భూమి కొనుగోలు చేసిన సప్తగిరి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించగా.. ఆ వ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమిలో కాకుండా గంగారెడ్డి భూమిలో పనులు చేస్తుండడం వివాదానికి దారితీసింది. బుధవారం సాయంత్రం తన వ్యవసాయభూమికి వెళ్లిన గంగారెడ్డితోపాటు కౌలుదారు అక్కడ పనులు చేస్తున్నవారిని అడ్డుకున్నారు. అధికారులు హద్దలు నిర్ణయించే వరకు పనులు చేపట్టొద్దని అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి ఏకంగా పదుల సంఖ్యలో మందిని రప్పించి గంగారెడ్డితోపాటు అతడి భూమి కౌలుదారు, డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వృద్దుడైన గంగారెడ్డి తీవ్రగాయాలపాలై ప్రాణాలతో బయటపడ్డాడు.
భూ వివాదమా అయితే సెటిల్ చేసుకో..
భూ వివాదాలు, కబ్జాలపై పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ‘భూవివాదమా.. అయితే సెటిల్ చేసుకో.. లేక పోతే ప్రాణాలు పోతాయి’ అని పోలీసులే బెదిరించడం గమనార్హం. ఇలా మోపాల్ పోలీస్ స్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విధంగా తనను సైతం భయబ్రాంతులకు గురి చేశారని బొడ్డు గంగారెడ్డి తెలిపాడు. భూమి వైపు వెళ్లొద్దని, ప్రాణాలు పోతాయని భయపెట్టారని అంటున్నాడు.
ఎమ్మెల్యే గారి పీఏ అండ?
తన భూమి విషయంలో ఓ ఎమ్మెల్యే పీఏ తలదూర్చారని, ఎమ్మెల్యే పేరు వాడుకుని రియల్టర్ తోపాటు పోలీసు అధికారి, పీఏ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బొడ్డు గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నాడు. మూడు నెలల క్రితం తన భూమి కౌలుదారు పంట వేయగా దానిని ట్రాక్టర్ తో దున్నివేశారని, ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. సిర్పూర్ గ్రామానికి చెందిన ఓ సాధువుకు 1984లో కేటాయించిన ఐదు ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేయగా, దానిని కూడా సెటిల్ చేసుకోవాలని పోలీసు స్టేషన్ లో పంచాయితీ పెట్టడం గమనార్హం.