నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న 8 ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ఒకటైన నిజాంబాద్ నగరంలోని సీతారామ నగర్ కాలనీ పట్టణా ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ బి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి స్త్రీ వైద్య నిపుణుల చేత నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందించి మహిళలను శారీరకంగా మానసికంగా ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దుతూ వారి ద్వారా కుటుంబాన్ని మెరుగుపరిచేలా చూడడమే ప్రధాన ధ్యేయమన్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేసి నిర్ధారణ పరీక్షలు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. దీనికోసం ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు
మరియు పర్యవేక్షక సిబ్బంది ముందుగానే ప్రణాళిక రచించుకుంటూ ప్రధాన ఆరోగ్య సమస్యలతో బాధపడే మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఆరోగ్య మహిళ శిబిరానికి పెద్ద మొత్తంలో తరలించి ఎక్కువ మంది మహిళలకు ఆరోగ్య సేవలు ఉపయోగపడేలా చూడాలన్నారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికలను, రికార్డ్స్ను,రిపోర్ట్స్ ను, ఐ ఎల్ ఆర్, టీకాలు భద్రపరిచే డీప్ ఫ్రీజర్, మందుల నిల్వను పరిశీలించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాలని, వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోనే 100% పూర్తి చేయాలని, నియమ నిబంధనలను ఉల్లంఘించి విధులకు హాజరు కాని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.