- దిశ సమావేశంలో ఎం.పీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, బతుకమ్మ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాల వివరాలను పూర్తి స్థాయి గణాంకాలతో పక్కాగా అందించాలని అధికారులకు సూచించారు. ఆయా పథకాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు కేటాయిస్తున్నాయి, ఎన్ని పనులు గ్రౌండింగ్ జరిగాయి, వాటిలో ఎన్ని పూర్తయ్యాయి వంటి వివరాలను పేర్కొనాలని, ఎం.పీ లాడ్స్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో శాశ్వత ప్రాతిపదికన తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులు ఇతర వాటికి దారి మళ్ళకుండా నిర్దేశించిన పనులకే వాటిని వెచ్చించాలని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎనలేని తాత్సారం జరుగుతోందని, అమృత్ పథకం కింద భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పనులు ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ పథకం పనులపై దసరా సెలవుల అనంతరం తాను ప్రత్యేకంగా సమీక్ష జరుపుతానని, పూర్తి వివరాలతో సమావేశానికి రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లి, మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్రిడ్జిలు, కల్వర్టులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయించాలన్నారు. నిజామాబాద్ ఆర్మూర్ మార్గంలో అటవీ భూమికి సంబంధించి చాలాకాలం నుండి పెండింగ్ లో ఉన్న వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించడం జరిగిందని, త్వరలోనే ఈ మార్గంలోని రెండు ప్రదేశాలలో రోడ్డు విస్తరణకు మార్గం సుగమం అయ్యిందని ఈ సందర్భంగా ఎం.పీ అర్వింద్ వెల్లడించారు. పీ.ఎం విశ్వకర్మ పథకం కింద అర్హులైన వారందరూ లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలని, ఈ పథకం అమలులో మూడవ స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లాను మొదటి వరుసలో నిలుపాలని సూచించారు. పీఎంశ్రీ పథకం గురించి ఎం.పీ వివరాలు కోరగా ఈ పథకం జిల్లాలో 8 పాఠశాలలకు కేంద్రం ద్వారా నిధులు మంజూరయ్యాయని, వాటిని అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లైబ్రరీలు, ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధి కోసం వెచ్చించామని డీఈఓ అశోక్ తెలిపారు. మద్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు వెంటవెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలని, అంగన్వాడి కేంద్రాలలో నాణ్యమైన కోడిగుడ్లు, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ చేయాలని ఎం.పీ సంబంధిత అధికారులకు సూచించారు. నాసిరకం కోడిగుడ్లు అందించిన కాంట్రాక్ట్ ఏజెన్సీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఎం.పీ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ విషయమై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ గోదావరి, మంజీరా బ్యాక్ వాటర్ కారణంగా జిల్లాలోని పరీవాహక గ్రామాలకు ఆనుకుని ఉన్న పంటలు నీట మునగడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పంట నష్టం జరిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక పంపామని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూనిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన తిలక్ గార్డెన్ వాణిజ్య సముదాయాలలో బినామీలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, కార్పోరేషన్ కు నామమాత్రపు అద్దె సైతం సంవత్సరాల తరబడి చెల్లించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావి,నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, దిశా కమిటీ సభ్యులు హన్మంత్ రావు, ఆశన్న, లింగం, విజయ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.