నిజామాబాద్, బతుకమ్మ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీల పరంగా సిద్ధాంత పరంగా ఓట్లు చీలడంతో పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి పరాజయం పాలయ్యారన్నారు. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీలు ఉండగా బీసీలందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో ప్రసన్న హరిక్రిష్ణకు ఓట్లు వేశారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉండి ఉంటే ఆ స్థానంలో అన్ని పార్టీలు బీసీలకే టికెట్ ఇచ్చేవని అన్నారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే మూడు అంశాలను ఒకే బిల్లులో పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మూడు అంశాలను ఒకే బిల్లులో పెడితే న్యాయవివాదం తలెత్తుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కవిత సూచించారు.