. . . శిలాఫలకాలపై పేర్లు, స్టాండింగ్ కమిటీల్లో వైస్ చైర్మన్ హోదా ఇవ్వాలని వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
గ్రామ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచ్‌లకు గౌరవ వేతనం కల్పించాలని, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల శిలాఫలకాలపై వారి పేర్లు కూడా చేర్చాలని రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం డిమాండ్ చేసింది. రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులు వికార్ పాషా ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప సర్పంచ్‌లు మంగళవారం జిల్లా సమీకృత భవన సముదాయంలో డీఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య పరిపాలన, పారదర్శకత, సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు ఉప సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు కల్పించాలని కోరారు. పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం సర్పంచ్ గైర్హాజరైనప్పుడు, పదవి ఖాళీ అయినప్పుడు లేదా విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉప సర్పంచ్‌కు సర్పంచ్ అధికారాలను వినియోగించే హక్కు కల్పించబడిందని వారు గుర్తు చేశారు. ఈ విధానం ద్వారా గ్రామ పంచాయతీల్లో అవినీతి నియంత్రణ, బాధ్యతాయుత పాలన, ప్రజాధనం సక్రమ వినియోగం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులేనని, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీ పరిపాలనలో వారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే వారు అందిస్తున్న సేవలకు తగిన గౌరవం, పారితోషికం లేకపోవడం బాధాకరమన్నారు. ఉప సర్పంచ్‌లకు నెలకు రూ.5,000, వార్డు సభ్యులకు రూ.3,000 చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం అందించాలని రాష్ట్ర ఫోరం తరఫున విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామ పంచాయతీ తీర్మానాల పత్రాలపై ఉప సర్పంచ్‌లకు సంతకం చేసే హక్కు కల్పించాలని కోరారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల శిలాఫలకాలపై ఉప సర్పంచ్‌ల పేర్లు చేర్చాలని, మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశాలకు వారిని కూడా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లోని వివిధ స్టాండింగ్ కమిటీలలో సర్పంచ్‌ను చైర్మన్‌గా గుర్తించినట్లే, ఉప సర్పంచ్‌ను వైస్ చైర్మన్‌గా గుర్తించాలని కోరారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్‌లకు ఎంత బాధ్యత ఉందో ఉప సర్పంచ్‌లకు కూడా అంతే బాధ్యత ఉందని పేర్కొం టూ, వారికి తగిన అధికారాలు, గౌరవ వేతనం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మహేష్‌తో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల ఉప సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.