రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై సీఎం సమీక్ష

 

. . . రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి  

 

. . . నిర్లక్ష్యం సహించేది లేదు

 

. . . కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు వీ.సీలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నుండి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా సీ.ఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు కేంద్రాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం రవాణాకు అవసరమైన లారీలను ఒప్పందం మేరకు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయడానికీ వెనకాడవద్దని స్పష్టం చేశారు. వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ ను ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం సూచించారు. గోదాముల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలని అన్నారు. మొక్కజొన్న పంట అధికంగా పండే జిల్లాల్లో కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్ల పురోగతిపై ఎప్పటికప్పుడు సీఎస్‌కు నివేదికలు పంపాలని ఆదేశించారు. ధాన్యం లోడింగ్‌లో జాప్యం లేకుండా స్థానిక హమాలీలను గుర్తించి వినియోగించుకోవాలని, ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని తెలిపారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, శాశ్వత పరిష్కారాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.  వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షణ చేయాలని, మిషన్ మోడ్‌లో పని చేస్తేనే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, మొక్కజొన్న కొనుగోలు సైతం 88శాతం పూర్తయ్యిందని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎక్కడైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, పౌర సరఫరాల శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, అరవింద్ రెడ్డి, డీఆర్‌డీఓ సాయన్న, మార్క్‌ఫెడ్ డీఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏ.డీ గంగుబాయి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీటీసీ దుర్గా ప్రమీల, ఎంవీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

CM reviews grain procurement and maize purchases in the state
Comments (0)
Add Comment