. . . వామపక్ష పార్టీల డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆయా పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సీపీఐ జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు ఓమయ్య, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయని తెలిపారు. ఆ బంద్‌లో భాగంగా జిల్లాలోని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని రెయాన్స్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలను బంద్ చేయడానికి వెళ్లిన సమయంలో యాజమాన్యానికి, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై యాజమాన్యం వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. అయితే అనంతరం కళాశాల యాజమాన్యంతో ఫిర్యాదు చేయించి విద్యార్థి నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై స్పందించి, కేసుల ఉపసంహరణకు కృషి చేయాలని కోరారు. పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకుని విద్యార్థి నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, విద్యారంగంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్ష విద్యార్థి నాయకులపై పోలీసులు కక్షపూరిత వైఖరి అవలంబించరాదని సూచించారు. విద్యార్థి నాయకులపై నమోదైన కేసులను ఎత్తివేయకపోతే వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు వెంకన్నతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.