నిజామాబాద్ అర్బన్‌లో డివిజన్ అధ్యక్షుల నియామకాల రద్దు

 

. . . పీసీసీ చీఫ్ ఇలాకాలో చక్రం తిప్పుతున్న ఓకే ఒక్కరు

 

. . . అర్బన్ డీసీసీ సిఫారసు చేసిన డివిజన్ అధ్యక్షుల నియామకాల నిలిపివేత

నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ అర్బన్ డీసీసీ పరిధిలో 60 మంది డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను రద్దు చేస్తూ పీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరవై రోజుల క్రితం జరిగిన నియామకాలు ఉన్నపళంగా రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు రావడం కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఇలాకాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో విస్తరించిన అర్బన్ డీసీసీ పరిధిలో డివిజన్ అధ్యక్షుల పదవులు పొందిన వారు కనీసం విస్తరణకు, ప్రమాణ స్వీకారానికి కూడా నోచుకోకుండానే పదవులు కోల్పోవడం సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ చాలా సంవత్సరాలుగా గుండెకాయ లాంటిది. దివంగత నేత డి. శ్రీనివాస్ (డీఎస్) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడం, తదనంతరం ఆయన మరణించిన తర్వాత నిజామాబాద్ అర్బన్‌కు పట్టున్న పార్టీ నాయకుడు కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు వలస వెళ్లిన వారు తిరిగి సొంత గూటికి చేరారు. కానీ అర్బన్‌లో మాత్రం ఎవరి పాచిక వారిదే అన్న పరిస్థితి నెలకొంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఇన్‌చార్జి షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వంటి నేతలు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నప్పటికీ, అర్బన్‌లో మాత్రం ఎవ్వరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి కొనసాగుతోంది. 60 డివిజన్ల కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి 17 మంది కార్పొరేటర్లు మాత్రమే గెలిచారు. మజ్లిస్ దోస్తానాతో మేయర్ పీఠాన్ని దక్కించుకుని పరువు నిలుపుకుంది.

 

 

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ పదవుల కోసం నాయకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 28 జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు డీసీసీ (సిటీ) అధ్యక్షుల నియామకాలు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయా కార్యవర్గాల విస్తరణ కూడా జరిగింది. ఆయా కమిటీల ఆధ్వర్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ పోటీ చేసింది. సంబంధిత ఎన్నికల సమయంలో కార్పొరేటర్, కౌన్సిలర్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికంటే జంపింగ్ జిలానీలకు టికెట్లు దక్కాయని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా కార్పొరేటర్ టికెట్లను అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి. పీసీసీ చీఫ్ ఇలాకాలో కార్పొరేటర్ టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా ఆరోపించారు. కొందరికి టికెట్లు ఇచ్చిన పేరుతో పార్టీ ఫండ్‌ను వెనక్కి తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్‌లో సీనియర్లు వర్సెస్ కొత్తగా వచ్చిన నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నుడా చైర్మన్ పదవిని భర్తీ చేసి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ డైరెక్టర్ల నియామకాలు జరగకపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది జరిగిన పలు ఆలయ కమిటీల పాలకవర్గాల్లో పార్టీ జెండా మోసిన వారికంటే కొందరు నేతల అనుచరులకే పదవులు దక్కాయని విమర్శలు ఉన్నాయి. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకాల్లో అర్బన్ నాయకులకు అన్యాయం జరిగిందనే వాదనలు ఉన్నాయి. గత నెలలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ పదవుల పంపకంలో కూడా పార్టీకి సంబంధం లేని వారికి అవకాశాలు కల్పించారనే ఆగ్రహం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

 

 

బల్దియా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పార్టీ పదవుల కోసం ఆశగా ఎదురుచూశారు. రూరల్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షుల నియామకాలు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచనల మేరకు జరగగా, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ అధ్యక్షుల నియామకాలు నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగాయి. అయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 50 డివిజన్ అధ్యక్షుల నియామకాల విషయంలో అందరి మధ్య సమన్వయం కుదరలేదని తెలుస్తోంది. ఈ నియామకాలపై కొందరు పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. పార్టీ జెండా మోసిన వారిని పక్కనబెట్టి, జంపింగ్ జిలానీలకు ఓకే ఒక్క నాయకుడు ప్రాధాన్యం ఇచ్చి నియామకాలకు సిఫారసు చేశారని, దానిని పీసీసీ ఆమోదించిందనేది ప్రధాన ఆరోపణ. బల్దియా ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను విస్మరించి టికెట్లు ఇవ్వడంతోనే 60 డివిజన్లలో కేవలం 17 డివిజన్లలో మాత్రమే విజయం సాధించిందని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అందరినీ సమన్వయం చేసే నాయకత్వం లేకపోవడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే బహిరంగ గొడవలకు దిగిన పరిస్థితులను వారు ఉదాహరణగా చెబుతున్నారు. పార్టీని సమన్వయం చేసే వారికి కాకుండా పెద్ద నాయకులు తమ అనుచరులకు పదవులు కట్టబెట్టి, వారి సూచనల మేరకు డీసీసీని నడిపించారని ఆరోపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో తయారైన జాబితా ప్రకారం డివిజన్ అధ్యక్షులను నియమించి, ఇప్పుడు అదే నియామకాలను రద్దు చేయడం ఏమిటని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

Cancellation of division president appointments in Nizamabad Urban
Comments (0)
Add Comment