నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, టీయుసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి హన్మండ్లు, ఐఎఫ్టియు అధ్యక్షుడు భూమయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివ లు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచి పెట్టే విధంగా ఉందని ఆరోపించారు. దేశంలో సంపద సృష్టించే కార్మికులు కర్షకులు పేదలు ప్రజల పైన భారాల మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. ఈ బడ్జెట్ దేశంలో పేదరికం నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక ,వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అంబానీ ఆదాని బడా కార్పొరేట్ శక్తులకు గులాంగిరి చేస్తుందని ఆరోపించారు. ఈ విధానాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే కాలంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంకావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్ అధ్యక్షులు గంగాధరప్ప ఏ ఐ టి యు సి దేవేంద్ర, చక్రపాణి, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్ జిల్లా నాయకులు కిషన్ మురళి రవి విటల్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేష్, సి ఐ టి యు జిల్లా నాయకులు కటారి రాములు రఫీక్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు చక్రి ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.