కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 04 లేబర్ కోడ్ లను అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంనరేందర్,  ఎం.సుధాకర్ లు  మాట్లాడుతూ  కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో 04 లేబర్ కోడ్ లుగా హడావుడిగా గెజిట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాల సవరణ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలం అనేక త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిసిపోయే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకోవటం దుర్మార్గమన్నారు. ఇన్ని రోజులు వెనకడుగు వేస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోటే కేంద్రంలో ఉన్న కార్పొరేట్ అనుకూల విధానాల అమలును వేగవంతం చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కోడ్ లు అమల్లోకి వస్తే కార్మికులు  అనేక హక్కులను కోల్పోతారన్నారు.  కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేయటం కోసమే ఇలాంటి చర్యలకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఉద్యోగ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016 లో సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఈనాటి వరకు అమలు చేయని మోడీ ప్రభుత్వం, దొడ్డిదారిన ఇలాంటి జీవోలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేటు కంపెనీల అనుకూల విధానాలను విడనాడాలని హెచ్చరించారు. వెంటనే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో దేశంలోని అసంఖ్యాక సంఘటిత అసంఘటిత కార్మికలోకం మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు పి. సాయరెడ్డి, బి.మురళి, రవికిరణ్, విటల్ పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ , టియుసిఐ నాయకులు లక్ష్మీకాంత్, శాంతి కుమార్, అమూల్య, చరణ్, గంగాధర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Burning of an effigy of the central government
Comments (0)
Add Comment