బాన్సువాడ ఆసుపత్రి ఎదుట బిఆర్ఎస్ ధర్నా

 

. . . మాత శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పై   నిరసన

. . . సిజేరియన్ ఆపరేషన్ ల వికటించిన ఘటన లో బాధ్యులపై చర్యలకు డిమాండ్

బాన్సువాడ, బతుకమ్మ :

బాన్సువాడ మాత శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ ఖలీల్ మాట్లాడుతూ గత శుక్రవారం, శనివారం పదిమంది గర్భిణీలకు సిజేరియన్ ఆపరేషన్ చేశారని చెప్పారు. వారిలో ఐదుగురు బాలింతలు ఆపరేషన్ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారికి రక్తం ఎక్కించాలని సూచించిన, ఎక్కించలేదని దీంతో రక్త కణాలు పడిపోయాయని ఆరోపించారు. అ తర్వాత కిడ్నీలో వాపు వచ్చిందని, సూపరింటెండెంట్ వారిని ముందు నిజామాబాద్ కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాల్సి వచ్చిందని అన్నారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకడంతో ముగ్గురికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదంతా ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు.గత కొన్ని రోజులుగా మాత శిశు ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవని ఆయన విమర్శించారు. డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండటం లేదని, అవసరమైన మందులు స్టాక్ లో లేవని, గర్భిణీలకు, నవజాత శిశువులకు చేయాల్సిన టెస్టులు, టీకాలు సరిగా జరగడం లేదని అన్నారు. డాక్టర్లు ఒంటి గంట తర్వాత తమ క్లినిక్ లను నిర్వహిస్తున్నారని అన్నారు. నీటి వసతి లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతున్నప్పటికీ, మా తల్లులు, పసిపిల్లలు ఆసుపత్రికి వస్తే నిరాశతో వెనుకకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ ధర్నాలో కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, మక్బూల్, ఖలీల్,నాయకులు అంజిరెడ్డి రెడ్డి, ఎర్రవట్టి సాయిబాబా, రమేష్ యాదవ్,మోచి గణేష్,అక్బర్, బాడీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

BRS holds protest in front of Banswada Hospita
Comments (0)
Add Comment