నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ప్రకృతి ఒడిలో పెరిగిన అందేశ్రీ ప్రకృతిని పాటగా మలిచిండని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో అందేశ్రీ ఫొటోకు పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. అందేశ్రీ అకాల మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప కవిని, గాయకుడిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందేశ్రీకి నిజామాబాద్ జిల్లా జనానికి అవినాభావ సంబంధం ఉన్నదని ఆయన అన్నారు. నిజామాబాద్ కు అందేశ్రీకి పేగు బంధం లేకున్న, పెనవేసుకున్న బంధం ఉన్నదని సాయరెడ్డి తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందేశ్రీ పాట లు కవాతులు చేశాయని, ప్రజలను పోరాటంలో మమేకం చేశాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అందేశ్రీ పాటలకు ప్రజలు పల్లవించారని తెలిపారు. ప్రజల గొంతుకలలో పాటలుగా నిలిచిన అందేశ్రీకి మరణం లేదని ఆయన అభివర్ణించారు.కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు .
