నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్చి 8 న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో 14 సంవత్సరముల బాలికలందరికి సర్వైకల్ క్యాన్సర్ నివారణకై హెచ్ పి వి టీకాలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. హెచ్ పి వి అనేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇది పునరుత్పత్తి మార్గం యొక్క సాధారణ సంక్రమణ అని అంటారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నకు ప్రధాన కారణం ఈ హెచ్ పి వి వైరస్ అవుతున్నదని, దేశవ్యాప్తంగా గౌరవ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఫిబ్రవరి 28 న ఇది ప్రారంభించడం జరిగిందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా అదే రోజు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేత ప్రారంభిoచడం జరిగిందన్నారు. భారతదేశ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అయినందున దీనిని అరికట్టడానికి హెచ్ పి వి టీకాలు వేయడం జరుగుచున్నదని తెలిపారు. హెచ్పీవీ టీకాలు వేయడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కొత్త కేసులను, మరణాలను తగ్గించవచ్చు అన్నారు. జిల్లాలో 14 సంవత్సరాల వయస్సున్న బాలికలు మొత్తం 12363 ఉన్నారని వీరందరికీ మొదటగా మార్చి 8 నాడు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుందని తరువాత అన్ని పీహెచ్సీలలో ప్రారంభమవుతుందన్నారు. కావున జిల్లా ప్రజలందరూ ఇది కొత్త వ్యాక్సిన్ కాదని ఇది 2006 సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతున్నదనన్నారు. అదేవిధంగా హెచ్ పి వి వ్యాక్సిన్ గార్డసిల్-4 చాలా ఖరీదైందని సుమారు ఐదు వేల నుండి ఆరు వేయిల రూపాయలు విలువ చేసే హెచ్ పి వి వ్యాక్సిన్ ను ప్రభుత్వ హాయంలో అర్హులైన 14 సంవత్సరాల అమ్మాయిలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున జిల్లా ప్రజలు సంతానం కలగదని, గర్భస్రావాలు అవుతాయని, పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతుందని, లాంటి ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ఇది చాలా సురక్షితమైన టీకా అని అర్హులైన 14 సంవత్సరాల అమ్మాయిలందరికీ అంటే 7 మార్చి 2011 నుండి 8 మార్చి 2012 మధ్యలో పుట్టిన అమ్మాయిలకు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాలన అధికారి సుమంత్ కుమార్, డి హెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
