వ్యవసాయ యాంత్రీకరణ .. అన్నదాతకు ఆసరా

0 2,188

. తగ్గనున్న సాగు భారం

. రాయితీపై పనిముట్లు

. యాసంగి నుంచి ఇచ్చేందుకు సన్నాహాలు

నిజామాబాద్, బతుకమ్మ: గత కొన్నేళ్లుగా వ్యవసాయ పనిముట్లు పొందేందుకు అవకాశం లేని రైతులకు త్వరలో ఊరట లభించనుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడక ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు సాగు పనిముట్లను రాయితీపై అందజేసింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులకు అవసరమైన పనిముట్లు అందజేయాలని యోచిస్తోంది.

కొన్నేళ్లుగా పథకాలకు మంగళం

తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు మరిన్ని రాయితీ పథకాలు వస్తాయని ఆశించిన రైతాంగానికి కేవలం రైతు బంధుతో సరిపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ట్రాక్టర్లు ఇచ్చినప్పటికీ, వీటిని వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఆ పథకం పూర్తయ్యాక అప్పటి నుంచి రైతులకు ఏ ఒక్క పరికరాన్ని రాయితీపైన అందించలేక పోయింది. వ్యవసాయశాఖ అధికారులు కనిపించినప్పుడల్లా ఏమైనా పథకాలు వచ్చాయా? అని ఆశగా అడిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సాగు ఖర్చు కోసం రైతుబంధు పేరిట ఎకరానికి ఐదు వేలు ఇస్తోంది.. అంతేకానీ ఏ పథకాలు రావడం లేదని అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగేవారు.

 తగ్గనున్న భారం

నేలను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్న రైతన్నకు క్షేత్ర స్థాయిలో కూలీలు, కిరాయిల ఖర్చు అధిక భారమవుతోంది. ఖరీఫ్, యాసంగి రెండు పర్యాయాలు సాగు కోసం అన్నదాత అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కూలి, ట్రాక్టర్లకు, ఎరువులకు పెట్టుబడి అధికమవుతోంది. భారం తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వారి పాలనలో ఇచ్చిన విధంగా రైతులకు కావాల్సిన యంత్ర పరికరాలను అందించేందుకు సిద్ధమవుతోంది.  రైతులకు అవసరమైన పనిముట్లను రాయితీపై అందించినట్లయితే వారి చేనులో పని పూర్తి చేసుకున్నాక, ఇతరులకు కిరాయికి ఇచ్చి కొంత ఆర్థికంగా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది.

 యాంత్రీకరణ

రైతులు ఎక్కువగా వాడే యంత్రాలను, పనిముట్లను ముందుగా ఇవ్వాలనే ధోరణిలో ప్రభుత్వం ఉంది. దీనికి గాను జిల్లాల వారీగా నివేదికలను తెప్పించుకునే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో నేలను దున్నేందుకు ట్రాక్టర్లు, పవర్ వీడర్లు, కల్టివేటర్లు, నాగళ్ళు, రోటవేటర్లు, పంటలపై మందు పిచికారీ చేసేందుకు తైవన్ స్ప్రేయర్లు, డ్రోన్లు, మొక్కజొన్న ఒలిచేందుకు యంత్రం, వరి కోత తర్వాత పశువుల గ్రాసం కోసం గడ్డిని కట్టలు కట్టేందుకు వినియోగించే బేలర్లను  అందివ్వనున్నారు.

 యాసంగి నుంచే..

జిల్లాల నుంచి నివేదికలను తెప్పించుకున్న అనంతరం ముందుగా ఆధునిక యంత్రాలపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రదర్శనలో అధునాతన పనిముట్లు, యంత్రాల  పని తీరును ప్రదర్శకులు సందర్శకులకు వివరించడం వల్ల ఆసక్తి ఉన్న వాటిని తీసుకునేందుకు రైతు ఉత్సాహం చూపుతాడు. ప్రస్తుతం వరి కోతలు పూర్తి కాబోతున్నాయి. యాసంగిలో సాగు చేసేందుకు రైతు సమాయత్తం అయ్యేంతలోపు వీలైనంత తొందరలో యాంత్రికరణ పనిముట్లను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.