పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు

0 14,546

కామారెడ్డి,  బతుకమ్మ : బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జిల్లా న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. 2022 సెప్టెంబర్ 18న బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన జల్దేవార్ శ్రీనివాస్ లైంగిక దాడికి యత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బాలిక నానమ్మ వచ్చింది. దీందీ నిందితుడు జరిగిన విషయాన్ని ఎవరైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా కుటుంబ సభ్యులను, గ్రామస్తులను విచారించి జల్దేవార్ శ్రీనివాస్ ను నేరస్తునిగా గుర్తించి పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి సీహెచ్.వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.30వేల జరిమానా విధించారు.

Leave A Reply

Your email address will not be published.