మేడ్చల్, బతుకమ్మ :
లంచం తీసుకుంటూ ఓ తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. భూమి సంబంధిత పనుల కోసం డబ్బులు డిమాండ్ చేసిన తహసీల్దార్ సుచరితను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం, బాధితుడి నుంచి పని చేయించేందుకు తహసీల్దార్ రూ.2 లక్షల లంచం కోరినట్లు సమాచారం. బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్బు తీసుకుంటుండగానే సుచరితను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో ఆమె చేతులు కడిగిన నీరు రంగు మారడం ద్వారా లంచం స్వీకరించినట్లు అధికారులు నిర్ధారించారు. అనంతరం కార్యాలయం నివాసంలో కూడా తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

