అన్ని డివిజన్లో సమస్యలను పరిష్కరిస్తా
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని డివిజన్లలో డ్రెయినేజీ సమస్య పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిత్యం శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. నాగారం 9వ డివిజన్లో ధన్ పాల్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. నగరంలో డ్రెయినేజీ సమస్య కీలకంగా మారిందని, డ్రెయినేజీల్లో చెత్త, నీరు నిల్వ ఉండటం చూసి మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అవసరం ఉన్న చోట డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మించాలని, అలాగే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి కోరత లేకుండా చూసుకోవాలన్నారు. అవసరం ఉన్న చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, బోర్స్ వేయాలని సూచించారు. ధన్ పాల్ లక్ష్మిభాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డివిజన్ ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం తన సొంత నిధులతో వేయించిన మంచి నీటి బోర్స్ ను మున్సిపల్ అధికారులను స్వాధీనం చేశారు. వాటికి మీటర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. డివిజన్ లో ఎలక్ట్రికల్ స్తంభాలు, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళి మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ మండల అధ్యక్షులు నాగరాజు,స్థానిక మాజీ కార్పొరేషన్ సాయి వర్ధన్, కిరణ్, సుందర్ రాథోడ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
