. . . తెరపైకి మేయర్ అభ్యర్థి 12వ డివిజన్ కార్పొరేటర్ దుమాలే అరుంధతి పేరు ?
. . . పీసీసీ నుంచి ఎఐసిసి వరకు విశ్వప్రయత్నాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి కొత్త మొఖాలు చర్చలోకి వస్తున్నాయి. మేయర్ అభ్యర్థి అయిన శమంత 19వ డివిజన్ లో ఓటమి పాలుకావడంతో కొత్త పేర్లు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తొలిసారి మేయర్ అభ్యర్థిని ముందుగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచిన మేయర్ క్యాండెట్ ను స్థానిక ప్రజలు ఓడించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో మిత్రపక్షమైన మజ్లీస్, బీఆర్ఎస్ తో కలిసి ఎక్స్ అఫిషియో ఓట్లతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయోగాలు ప్రారంభించింది. శుక్రవారం ఫలితాలు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థిని తమ గుప్పిట పెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి సఫలమైంది. ఈ నేపథ్యంలో మేయర్ క్యాండెట్ ఎవరని అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలయింది. 14 స్థానాలు గెలిచిన ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ స్థానం ఇవ్వడం ఖరారు అయిన నేపథ్యంలో 17 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తమ మేయర్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు తర్జనభర్జనలు పడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శమంత (నరేందర్ రెడ్డి) ఓటమి పాలుకావడంతో కొత్త అభ్యర్థి వెతుకులాటలో కాంగ్రెస్ పార్టీ పడింది. కాంగ్రెస్ పార్టీలో మేయర్ ఎంపిక వ్యవహరం పీసీసీ అధ్యక్షుడిని దాటి ఎఐసీసీకి చేరింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖరారు చేసిన అభ్యర్థులు 20 మంది కూడా గెలువకపోవడంతో ఎఐసీసీ తీవ్రంగా పరిగణించింది. పతంగి పార్టీ మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండడంతో అందుకు సమర్థులైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీలో శనివారం వరకు 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ నుంచి గెలిచిన ఉమారాణి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే నిజామాబాద్ నగరంలోని 12వ డివిజన్ లో గెలిచిన దుమాలే అరుంధతి పేరు తెరపైకి వచ్చింది. కేవలం 65 ఓటర్లు ఉన్న మెజార్టీ ఓటర్ల స్థానంలో మైనార్టీ ఓటర్ల మనస్సును గెలుచుకున్న అరుంధతిని మేయర్ ను చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నిజామాబాద్ మేయర్ స్థానం జనరల్ మహిళ కావడంతో 12వ డివిజన్ అభ్యర్థి దుమాలే అరుంధతి పేరును పరిశీలనలోకి తీసుకుంది. దుమాలే అరుంధతి పుత్రుడు అయిన ఆదిత్యపటేల్ ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఎఐసిసితో పాటు పీసీసీలో తనకు ఉన్న పరిచయాలతో తమ తల్లి అరుంధతిని మేయర్ స్థానంపై నిలబెట్టేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పంచరెడ్డి లలిత గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడం మైనస్ గా మారింది. బీఆర్ఎస్ లో పోటీ చేసిన అభ్యర్థికి మేయర్ స్థానం ఎలా ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక కూరగాయల ఉమారాణి వ్యక్తిగత పరిచయం పీసీసీ అధ్యక్షుడు అనుచరుడి పరిచయానికే పరిమితం కావడంతో ఆర్థిక మూలాల విషయం వారికి అడ్డంకిగా మారింది. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో గెలువడానికే నిధులను మంచినీళ్ళప్రాయంలా ఖర్చు చేసిన ఆదిత్యపటేల్ తన తల్లిని మేయర్ చేసేందుకు పీసీసీ మొదలుకుని ఎఐసిసి వరకు ప్రయత్నాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును పీసీసీ అమ్ముకుందనే విషప్రచారం సమయంలో కొత్త అభ్యర్థి వ్యవహరం పార్టీలోనూ చర్చ మొదలయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. సీల్డ్ కవర్ రాజకీయాలకు, అమ్ముడుపోయే వ్యవహరాలకు కాంగ్రెస్ కేరాఫ్ అనే విషయం తెల్సిందే. 60 డివిజన్లు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే అంగ బలంతో పాటు ఆర్థిక బలం ముఖ్యం. 49, 21వ డివిజన్ కార్పొరేటర్లకు ఆ అవకాశం లేకపోవడంతో కొత్తగా మేయర్ అభ్యర్థి వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న జరిగే మేయర్ ఎన్నికల్లో కొత్త అభ్యర్థే మేయర్ గా ఎన్నిక కావడం ఖాయంగా మారింది.
