. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కలకలం
బోధన్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ సిబ్బంది ఓ పెంపుడు కుక్కను ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని శక్కర్ నగర్ కు చెందిన ఆర్ గణపతిరాజు తన ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కను కట్టేసి ఉంచారు. మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కుక్కల నివారణ సిబ్బంది సోమవారం సాయంత్రం పట్టణంలో తిరుగతూ గణపతిరాజు ఇంటి ఆవరణలో ఉన్న కుక్కకు ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే మరణించింది. ఇంటికి చేరుకున్న గణపతిరాజు తన పెంపుడు కుక్క చనిపోయి ఉండడాన్ని గమనించి ఆందోళనకు గురయ్యాడు. దుఖాన్ని దిగమింగుకుని మున్సిపల్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుక్కను చంపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరాడు.

