. . . తప్పిన పెను ప్రమాదం
. . . ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న భారీ మర్రిచెట్టు శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విరిగిపడింది. చెట్టు పడిన సమయంలో సమీపంలో భక్తులు, కల్లు ప్రియులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రేణుక ఎల్లమ్మ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయం సమీపంలోనే కల్లు దుకాణం ఉండటంతో కల్లు సేవించే వారు కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు. అయితే శుక్రవారం సాయంత్రం చిరుజల్లులతో కూడిన ఈదురుగాలులు వీయడంతో చెట్టుకు సమీపంలో ఎవరూ లేకపోవడం అదృష్టంగా మారింది. చెట్టు విరిగిపడిన సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం వంటి రద్దీ రోజుల్లో ఇలాంటి ఘటన జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న భారీ వృక్షాలను అధికారులు ముందుగానే గుర్తించి, భక్తుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
