. ఏకగ్రీవం కోసం కేంద్ర కమిటీ ప్రయత్నాలు
. ఎన్నిక జరగాల్సిందేనంటున్న జిల్లా కార్యవర్గం
. పదవుల కోసం పైరవీలు
. రెండు గ్రూపులుగా వీడిపోయిన టీఎన్జీవో కార్యవర్గం
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ నాగ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇది వరకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన అలుక కిషన్ సెప్టెంబర్ 8న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతోపాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలం టీఎన్జీవో పై తన పట్టును నిలుపుకున్న అలుక కిషన్ తన వర్గానికి చెందిన వారిని టీఎన్జీవో పదవుల్లో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఎన్జీవో బైలా ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ కాగానే అక్కడ సెక్రటరీ గా ఉన్న వ్యక్తి అధ్యక్షుడు కావడం ఆనవాయితీగా వస్తోంది. కేంద్ర కమిటీ లోనూ అదే జరిగింది. ప్రస్తుతానికి జిల్లా కార్యదర్శితోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ విభాగంతోపాటు ఐదు తాలూకా యూనిట్లు ఉన్నాయి. మొత్తం 36 మంది ఓటర్లు నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. అంతకుముందు తాలూకా కార్యవర్గాల ఎన్నిక జరగాల్సి ఉంది. ఎన్నికైన కార్యవర్గాల కమిటీ సభ్యులు మొత్తం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోనున్నారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో తాలుకాలకు జిల్లా కార్యవర్గంలో పనిచేస్తున్న వారు టీఎన్జీవోలో పదవులను ఆశిస్తున్నారు. అందుకోసం ఎవరికివారు పైరవీలు చేస్తున్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఈసారి కేంద్ర కమిటీ వర్సెస్ నిజామాబాద్ జిల్లా కమిటీ అన్న చందంగా మారుతున్నాయి. తాలుకాలతోపాటు జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఇదివరకే జరగాల్సి ఉండగా ఏకగ్రీవం లేదా ఎన్నికలు జరగాలని రెండు వర్గాలు పట్టుబడుతున్నాయి. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న గైని గంగారం ఓ వర్గంగా, ప్రస్తుత టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్ మరో వర్గంగా ఎన్నికల హడావుడి నెలకొంది. కేంద్ర కమిటీ నాయకత్వం ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేస్తుండగా జిల్లా చెందిన వారు మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలని పట్టుబడుతున్నారు. ఏకగ్రీవమైతే కేంద్ర కమిటీ నాయకత్వం మాట నెగ్గుతుందని, అదే ఎన్నికలకు వెళితే స్థానికంగా ఎవరు బలమైన నాయకులో తేలిపోతుందంటున్నారు. టీఎన్జీవో జిల్లా కమిటీతోపాటు తాలూకా పాలకవర్గాలపై కన్నేసిన కొందరు ఇప్పటికే పైరవీలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అధికార కాంగ్రెస్ నాయకులతో కేంద్ర. జిల్లా నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కేంద్ర కమిటీ నాయకత్వం ముందు మోకరిల్లాగా మరికొంతమంది జిల్లాలో పట్టణ నేతల వద్ద తమకు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద నవంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. టీఎన్జీవో ఎన్నికల కోలహలం దీపావళి ముగియగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
